Prasanna Kumar: శ్రీలీల వల్ల కాదు.. కథ వల్ల ధమాకా హిట్టయింది: రైటర్ ప్రసన్న కుమార్
వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ(Ravi Teja)ను ధమాకా(Dhamaka) మూవీ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురావడం తెలిసిందే. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఈ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణం శ్రీలీల(Sree Leela) డ్యాన్సులు, ఆమె ఎనర్జీ, సాంగ్స్ అని అందరూ అన్నారు. అయితే శ్రీలీల వల్లే ఈ సినిమా అంత హిట్ అవలేదని ఆ చిత్ర బృందంలోని ఒక ముఖ్య సభ్యుడు తాజాగా కుండ బద్దలుకొట్టాడు.
ఈ విషయమై ఇటీవల రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ(Prasanna Kumar Bezawada)ను కొందరూ జర్నలిస్టులు అడిగితే హీరోయిన్ అందచందాలు, డ్యాన్సుల వల్ల సినిమా ఆడేస్తుందా అని అతడు రివర్స్ లో ప్రశ్న వేశాడు. ధమాకా తర్వాత కూడా శ్రీలీల చాలా చిత్రాల్లో నటించిందని, అందులో కూడా బాగా డ్యాన్స్ వేసింది, చాలా అందంగా కనిపించిందని కానీ అవన్నీ హిట్టవలేదు కదా అని అన్నాడు.
ఏ సినిమా అయినా హిట్ అయిందంటే దానికి ముఖ్య కారణం కథేనని, సినిమాలో పాటలు 20 నిమిషాలు కూడా ఉండవని, ఆ ఇరవై నిమిషాలు ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినంత మాత్రాన సినిమా ఆడదని, మిగిలిన 2 గంటలు కూడా సినిమా బాగుంటూనే ఫ్యాన్స్ సినిమాను ఆదరిస్తారని ప్రసన్న కుమార్ అన్నాడు.
సినిమా బావుంటే పాటలు, హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులు ఆ చిత్రానికి బోనస్ అవుతాయి తప్పించి కేవలం గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమాలు ఆడవని ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చాడు. ధమాకాలో కామెడీ బాగా పండడం వల్లే సినిమా అంతపెద్ద బ్లాక్ బస్టర్ అయిందని ప్రసన్న కుమార్ తెలిపాడు.













