మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ విమర్శలు
రెండేళ్ల ముందు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఎంత హీటెక్కించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదేళ్లకోసారి జరిగే సాధారణ ఎన్నికల రేంజ్ లో మా ఎలక్షన్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఈ ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచి మా అధ్యక్షుడయ్యాడు. ఎన్నికల తర్వాత కూడా డ్రామా కొనసాగి, ప్రకాష్ రాజ్ తన మెంబర్‌షిప్‌కు రాజీనామా చేయడం, ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లు కార్యవర్గం నుంచి తప్పుకోవడం లాంటివి జరిగాయి.
ఆ తర్వాత మళ్లీ రెండు ప్యానెల్స్ సైలెంట్ అయ్యాయి. మా యాక్టివిటీస్ పై కూడా మీడియాలో వార్తలేమీ రాలేదు. ఇప్పుడు మళ్లీ మా ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశాడు. మా అధ్యక్షుడిగా విష్ణు పనితీరు సున్నా అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు.
రెండేళ్లయినా, విష్ణు కనీసం ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదని, ఇప్పటికీ మాకు సొంత భవనం నిర్మించలేదని, మా ప్రెసిడెంట్‌గా విష్ణు ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదని, ఇప్పుడైనా విష్ణును ఎన్నుకున్న వాళ్లు ఆలోచించాలని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, వచ్చే మా ఎలక్షన్స్ లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతం తన ఫోకస్ అంతా నేషనల్ ఇష్యూస్ పై ఉందని, కెరీర్ పరంగా కూడా బిజీ షెడ్యూల్ ఉందని ఆయన తెలిపాడు.













