ప్రభాస్ మాట్లాడింది తక్కువ.. వసూలు చేసింది ఎక్కువ
స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో చూసేటప్పుడు కొన్ని విషయాలు మనం సరిగా గమనించలేం కూడా. కానీ ఓటీటీ వచ్చాక మాత్రం ప్రతీ పాయింట్ ను తీక్షణంగా చూస్తారు ఆడియన్స్. సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాను అఫీషియల్ గా నెట్‌ఫ్లిక్స్ లో కొంత మంది చూస్తుంటే, ఇతరత్రా మార్గాల్లో మరికొందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తానికి సలార్ ఓటీటీలో కూడా చాలా రచ్చ చేస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ మాట్లాడింది చాలా తక్కువ. డైలాగ్స్ కూడా పెద్దగా ఎక్కువ ఉండవు. దీంతో ప్రభాస్ మాట్లాడిన మాటలన్నింటినీ ఓ దగ్గర చేర్చి దాన్ని వీడియోగా తయారు చేసి, ఆ వీడియోను నెట్టింట వైరల్ చేయడం మొదలుపెట్టారు డార్లింగ్ ఫ్యాన్స్.
సలార్ సినిమా మొత్తం మీద ప్రభాస్ డైలాగ్స్ నిడివి అంతా కలిపి నాలుగు నిమిషాలకు లోపే. ఆ వీడియోను కాస్త స్పీడ్ మోడ్‌లోకి మారిస్తే రెండున్నర నిమిషాలే ఉంటుంది. ప్రభాస్ ఆ నాలుగు నిమిషాలల్లో ఎక్కువగా మాట్లాడింది పృథ్విరాజ్ తోనే. అంతే కాదు సలార్ లో కీలక పాత్రలు చేసిన శ్రేయా రెడ్డి, దేవరాజ్, బ్రహ్మాజీ, టినూ ఆనంద్‌తో కూడా ప్రభాస్‌కు డైరెక్ట్ సంభాషణలు లేకపోవడం మరో విచిత్రం. ప్రభాస్ ఎంత తక్కువ మాట్లాడినా బాక్సాఫీస్ వద్ద మాత్రం బాగానే కలెక్షన్లు సంపాదించాడు.













