ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభాస్
బాహుబలి సినిమా తర్వాత సాహో కు లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్, ఆ తర్వాత రాధేశ్యామ్ కోసం కూడా మళ్లీ అంతే గ్యాప్ తీసుకున్నాడు. దీంతో తమ అభిమాన హీరోని కనీసం సంవత్సరానికొకసారైనా చూడలేకపోతున్నామని బాధపడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్, ఇకపై సంవత్సరానికి మూడు రిలీజులుండేలా చూసుకుంటానని తన అభిమానులకు మాటిచ్చాడు.
ఏదో మాట వరసకి అన్నాడు కానీ అదెలా సాధ్యమనుకుని ప్రభాస్ మాటల్ని చాలా మంది నమ్మలేదు. స్టార్ హీరోలందరూ ఒక్కో సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటుంటే ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలంటే కాని పనిలే అనుకున్నారు. కానీ ప్రభాస్ చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు లెక్కలోకి తీసుకుంటే ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వచ్చినట్లే లెక్క.
గతేడాది జూన్ లో ఆదిపురుష్, డిసెంబర్ లో సలార్ పార్ట్1 రిలీజ్ కాగా, ఇప్పుడు మళ్లీ జూన్ లో కల్కి సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించడానికి డార్లింగ్ రెడీ అయ్యాడు. ప్రభాస్ స్థాయిలో ఉన్న ఏ హీరోని చూసినా సరే ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేయడం లేదు. అయితే ఈ జోష్ ను ప్రభాస్ తగ్గించే మూడ్ లో ఏ మాత్రం లేడు. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్ లో పీరియాడిక్ డ్రామా ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా సలార్2, కల్కి2 ఎలాగూ లైన్ లో ఉన్నాడు. వీటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం ఇకపై సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యాడని తన సన్నిహితులు చెప్తున్నారు.













