క్రిస్మస్ బరిలో ది రాజా సాబ్?
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్ అయినప్పటికీ సలార్ తో మళ్లీ ప్రభాస్ ఫామ్ లోకి వచ్చాడు. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. దీంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాను క్రిస్మస్ బరిలో దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఎంతో నెగిటివిటీ ఉన్నప్పటికీ రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ తో అదంతా పోయింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది రాజా సాబ్.
ఈ సినిమాను ముందు దసరాకు రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, ఆల్రెడీ ఇప్పటికే ఆ తేదీకి పలు రిలీజ్లు షెడ్యూల్ అవడంతో క్రిస్మస్ సీజన్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు సలార్ రిలీజైన డిసెంబర్ సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి క్రిస్మస్ రిలీజ్ కోసం చూస్తున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటూ మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.













