స్పిరిట్ కోసం ప్రభాస్ మేకోవర్
ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.500 కోట్ల పైన కలెక్షన్స్ సాధించడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కల్కి మంచి హిట్ అవడంతో సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చే స్పిరిట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. యానిమల్ తో రణ్బీర్ లాంటి సాఫ్ట్ హీరోకే ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు సందీప్. ఇప్పుడు అలాంటిది స్పిరిట్ లో ప్రభాస్ కు ఎంతటి ఎలివేషన్స్ ఇస్తాడో అని చూడ్డానికి అందరూ వెయిట్ చేస్తున్నారు.
స్పిరిట్ లో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర లో కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్ చెప్పాడు. ఈ కథ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండనుందని టాక్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్, సందీప్ కలిసి స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేశారట. ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ ను మార్చుకోవాలని సందీప్, ప్రభాస్ కు చెప్పినట్లు తెలుస్తోంది. స్పిరిట్ కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ తో ప్రభాస్ ను ఫిట్ గా రెడీ అవమని సందీప్ సూచించాడట. ప్రస్తుతం యూరప్ వెకేషన్ లో ఉన్న ప్రభాస్, తిరిగి రాగానే ఈ లుక్ పై వర్కవుట్ చేయనున్నట్లు తెలుస్తోంది.













