ప్రభాస్‌తో క్రిష్ మూవీ ?
బాహుబలితో ఒక్కసారిగా తన క్రేజ్‌ను పెంచుకున్నాడు ప్రభాస్. కానీ తర్వాత చేసిన రెండు సినిమాలు మాత్రం తేడా కొట్టేశాయి. అయినా సరే ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి భారీ సినిమాలతో పాటూ మారుతి తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇది కాకుండా సందీప్ రెడ్డి వంగా తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వీటిలో నాలుగు సినిమాలు ఏడాది వ్యవధి లోనే రిలీజ్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ కొత్త సినిమా గురించి రెండు రోజులుగా ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో ప్రభాస్ ఓ మూవీ కమిటైనట్లు సమాచారం. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
రాజమౌళితో అయితే ఈ సినిమా చేసే ఛాన్సులు లేవు. ఆయనతో సినిమా చేయాలంటే కనీసం దానికోసం మూడేళ్లయినా ఆగాలి. ఆర్కా మీడియా వారికి అంతవరకు ఆగే ఉద్దేశం లేదు. వారి దృష్టిలో వేరే దర్శకుడు ఉన్నాడనేది సన్నిహిత వర్గాల సమాచారం. విలక్షణ దర్శకుడు క్రిష్‌తో ప్రభాస్ హీరోగా మూవీ చేయాలనేది బాహుబలి నిర్మాతల ఆలోచన. వీరితో క్రిష్ కు కూడా మంచి బంధమే ఉంది. వేదం మూవీకి వీరే నిర్మాణ భాగస్వాములు. క్రిష్ తో కలిసి ఓ స్టోరీ మీద ఎప్పటినుంచో శోభు, ప్రసాద్‌లు చర్చలు జరుపుతున్నారట.
స్టోరీ ఇంకా ఓ షేప్ కు రాలేదు కానీ ఈ లోపే ప్రభాస్ శోభు, ప్రసాద్‌కు సినిమా చేయడానికి మాటిచ్చేశాడు. ఎలాగైనా ఈ స్టోరీని వర్కవుట్ చేసి ప్రభాస్- క్రిష్ కాంబోలో సినిమా చేయాలనేది ఆర్కా వారి ఆలోచన. మరి వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రానుందో చూడాలి.













