ఈ భారీ కాంబినేషన్ కుదిరినట్టేనా..!
కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయంతో పాటు, KGF-2 మూవీకి ఏర్పడిన భారీ హైప్ చూసిన స్టార్ హీరోలు, బడా నిర్మాతలు ప్రస్తుతం సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ చిత్రంలో నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మధ్య ప్రశాంత్ నీల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలవటం కూడా జరిగింది.
తాజాగా మరో పెద్ద నిర్మాత దిల్ రాజు, ప్రశాంత్ నీల్ తో పనిచేయబోతున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తుంది. బాహుబలి సినిమా నుండి ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేయాలని వేచిచూస్తున్న దిల్ రాజు, ప్రశాంత్ నీల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రభాస్ రాధాకృష్ణ కుమార్‌తో రాధే శ్యామ్, ప్రశాంత్ నీల్‌తో సలార్, ఓమ్ రౌత్‌తో ఆది పురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఓ మూవీలో నటించనున్నాడు. దిల్ రాజు సైతం తన డ్రీం ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న వకీల్ సాబ్ చిత్రం విడుదల పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు భారీ బ్లాక్ బస్టర్ మూవీ F2 కి సీక్వెల్ గా వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ హీరోగా ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించనున్నభారీ బడ్జెట్ చిత్రాన్ని దిల్ రాజునే నిర్మిస్తున్నారు. ఏమాత్రం సమయం తీరికలేకుండా వరుస చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ త్రయంలో మూవీ వస్తుంది అనే వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.













