ఆ రెండు సినిమాల అప్డేట్స్ ఏవి? నిరాశలో ప్రభాస్ అభిమానులు!
తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమా ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను, దర్శకులను, నిర్మాతలను, ఇతర టెక్నీషియన్లను ప్రేక్షకులకు పరిచయం చేసింది. తమ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటీనటులు, డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇన్ని దశాబ్దాల్లో ఏ హీరో అందుకోనటువంటి ఖ్యాతిని హీరో ప్రభాస్ సొంతం చేసుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన ఛరిష్మాతో ఎవరూ తనను అందుకోలేని స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. వరసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఆలిండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. అలాంటి టాప్ హీరో మూడు భారీ సినిమాల్లో నటిస్తున్నాడంటే ఆడియన్స్‌లో ఎంత క్రేజ్ ఉంటుంది? అతను చేసే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ఎంత కుతూహలంగా ఉంటుంది? ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టినరోజుకి అలాంటి పరిస్థితే ఏర్పడింది.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న `రాధేశ్యామ్`తోపాటు నాగ్ అశ్విన్ ఒక సినిమా, ఔం రౌత్ దర్శకత్వంఓ `ఆదిపురుష్` చిత్రాలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రబాస్ పుట్టినరోజు నాడు `రాధేశ్యామ్` సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందని మొదటి నుంచీ చిత్ర యూనిట్ ప్రకటిస్తూ వస్తోంది. చెప్పినట్టుగానే `రాధేశ్యామ్` చిత్రానికి సంబంధించి `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్` విడుదలైంది. ఒక పాన్ ఇండియా మూవీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయని విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ టీజర్ చూసిన అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ పుట్టినరోజుకే మిగతా రెండు సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే వారికి నిరాశే మిగిలింది.
ఇప్పటికే నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుందని చిత్ర యూనిట్ పకటించింది. అంతేకాదు, ఈ సినిమాలోని ఓ కీలక పాత్రను బిగ్‌బి అమితాబ్ పోషిస్తారని మరో అప్డేట్ ఇచ్చింది. ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ సరసన సీతగా ఎవరు నటిస్తారనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో రకరకాల హీరోయిన్ల పేర్తు వినిపించినా ఇప్పటివరకు ఏదీ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే రావణాసురుడుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖన్ నటిస్తాడని ముందుగానే ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టినరోజుకు ఈ రెండు సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అంతటితో సరిపెట్టుకున్నారు నాగ్ అశ్విన్, ఓం రౌత్. ఆరోజు వరకు ఈ సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు నిరాశే మిగిలింది. అసలు సినిమా షూటింగే మొదలుపెట్టకుండా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేమని గ్రహించిన ఇద్దరు డైరెక్టర్లు సైలెంట్ అయిపోయారు.













