పీపుల్స్ మీడియాతో ప్రభాస్ మరో మూవీ!
మరో రెండు వారాల్లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత మూడు నెలలకు సలార్ సినిమా రాబోతుంది. ఆ తర్వాత నాలుగు నెలలకు ప్రాజెక్ట్ కె తో పలకించనున్నాడు ప్రభాస్. వీటి తర్వాత కొన్ని నెలలకు మారుతి సినిమా కూడా వచ్చేస్తుంది.
చేతిలో ఉన్న సినిమాలన్నీ ఈ ఏడాది చివర్లోపు పూర్తి చేసి, తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజుల అయింది. టీ సిరీస్ తో కలిసి, ప్రభాస్ హోం బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ తో ఈ సినిమాను రూపొందించాలని సన్నాహాలు చేసుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణం విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడుతుండగా, యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. టీ సిరీస్ తో కలిసి ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుందట. ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబోలో ఓ సినిమా ఈ బ్యానర్ లో రూపొందుతుండగా, ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కూడా వీళ్లే భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.
అంటే ప్రభాస్ పై ఎంత నమ్మకముంటే ఈ బ్యానర్ వరుసగా ఆయనతో సినిమాలు చేస్తుందనేది అర్థం చేసుకోవాలి. అంతేకాదు ప్రభాస్ కు కూడా ఎంతో నమ్మకం ఏర్పడితే తప్పించి యువి తో కాకుండా వీరితో స్పిరిట్ ను చేయాలనుకోడు. స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాలంటే సందీప్ యానిమల్, ప్రభాస్ తన సినిమాలన్నీ పూర్తి చేయాల్సి ఉంది.













