మళ్ళీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు థియేటర్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను చూస్తామా..? అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీజర్లు, ఫస్ట్‌లుక్‌లతో సినిమా క్రేజ్‌ని ఇంకో రేంజ్‌కి తీసుకువెళ్లాడు రాజమౌళి. ఇక్కడవరకూ అంతా బాగానే ఉంది. కానీ, సినిమా విడుదల తేదీ విషయంలోనే అభిమానులు తీవ్ర నిరాశ పడుతున్నారు. తొలుత ప్రెస్ మీట్ లో 2020, జూలై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.
కానీ, కరోనా రావడం, 2020 లాక్డౌన్ తదితర కారణాలు అప్పుడు సినిమా విడుదలకు అడ్డంకిగా నిలిచాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ఏడాది జనవరిలో సినిమా విడుదల అవుతుందన్నారు. కానీ, అదీ జరగలేదు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ సరిగ్గా జరగకపోవడం, తదితర కారణాలతో సినిమా విడుదల వాయిదాపడుతూ వచ్చింది. చివరిగా ఈ అక్టోబర్ 13న సినిమా పక్కాగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్.. కానీ, అభిమానులకు అప్పటికీ నమ్మకం కుదరలేదు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఈసారి సినిమా విడుదలలో ఎటువంటి జాప్యం ఉండేది లేదంటూ బల్ల గుద్ది చెప్పింది. దీంతో అభిమానులు ఈసారి సినిమా పక్కా అని ఫిక్స్ అయ్యారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా రెండో వేవ్ కారణంగా సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ భారీ సెట్లో సినిమాలో అతి కీలకమైన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందట. దీంతో సినిమా విడుదల మరోసారి వాయిదాపడే సూచనలు ఉన్నాయంటూ.. ఫిలిమ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. కరోనా కేసులు తగ్గి, మళ్లీ షూటింగ్ యధావిధిగా జరిగితే, కాని వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట.













