సోనూసూద్ కంటే వెయ్యి రెట్లు బ్రాడ్ మైండెడ్ మన టాలీవుడ్లో ఉన్నారు
ఎప్పుడైనా ఏ విషయంపై అయినా తమ మాటలతో వివాదాలకు తెరతీసే వ్యక్తులు కొందరుంటారు. అలాంటి వారిలో పోసాని కృష్ణమురళి ఒకరు. ఏదైనా అన్యాయం జరిగితే దానిపై నోరు విప్పుతారు. అనర్గళంగా మాట్లాడతారు. తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. కొన్ని విషయాలు తనకు సంబంధం లేకపోయినా అందులోని కొన్ని అంశాలతో వివాదాలకు తావిచ్చేలా మాట్లాడతారు. తాజాగా అలాంటి చర్చే ఒకటి జరిగింది. లాక్డౌన్ మొదలైన తర్వాత బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి ఎన్నో విధాలా సాయం చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతోంది. అతను ఎక్కువగా విలన్ పాత్రలే పోషించాడు. కానీ, నిజజీవితంలో హీరో అనిపించుకున్నాడు. ఈ విషయం గురించి పోసాని ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ప్రస్తావించారు.
“సోనూ సూద్ చేసే పనిలో గొప్ప ఏం ఉంది? అలాంటి సహాయాలు తెలుగు హీరోలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దేశంలో ఏ విపత్తు సంభవించినా వెంటనే స్పందించి కోట్లు విరాళాలుగా అందించారు. కానీ, ఇప్పుడు సోనూ సూద్ చేసుకుంటున్నంత ప్రచారం తెలుగు హీరోలుగానీ, ఇతర సినీ ప్రముఖులుగానీ చేసుకోలేదు. లాక్డౌన్ సమయంలో నేను కూడా నాకు తోచినంత సహాయం చేశాను. కానీ, నేను చెప్పుకోలేదు. నా నుంచి సహాయం అందుకున్నవారికి అది తెలుస్తుంది. మరి సోనూ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలన్నీ దేనికి చేస్తున్నాడో.. ప్రజలపై ప్రేమతోనా లేక మరేదైనా కారణం ఉందా? అది ఆయనకే తెలియాలి. ఇలా అందరికీ సహాయం చేస్తూ ప్రచారం చేసుకున్నంత మాత్రాన సినిమాల్లో అవకాశాలు రావు. సోనూ సూద్ అంటే ఈమధ్యే వచ్చాడు. కానీ, మన హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ఎంతో కాలంగా సహాయం చేస్తూ వస్తున్నారు. వాటితో పోలిస్తే సోనూ చేస్తోంది ఎంత. కానీ, సోనూని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రియల్ హీరో అంటూ జేజేలు పలుకుతున్నారు. దానికి అంత అవసరం ఉందా? సోనూ కంటే వెయ్యిరెట్లు బ్రాడ్ మైండెడ్ మన తెలుగు ఇండస్ట్రీ. అది తెలుసుకోవాలి” అన్నారు.













