కమెడియన్ వేణు మాధవ్ ఇక లేరు
ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్(40) 12:21 నిమిషాలకు కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆసుప్రతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. వేణుమాధవ్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రముఖులు ప్రార్థించారు. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానూభూతి తెలిపారు.
మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ ఆ తర్వాత కామెడియన్‌గా రాణించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రంతో ఆయన ఆరంగ్రేటం చేశారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు మేణుమాధవ్. టాలీవుడ్లో 600లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. మేణు మాధవ్ స్వస్థలం నల్గొండ. పెరిగింది కోదాడ. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియంలోనే చదివారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. 30 డిసెంబర్, 1979లో మేణు మాధవ్ జన్మించారు. 2006లో వెంకటేశ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆది, సింహాద్రి, సై, రణం, వెంకీ, ఛత్రపతి, పోకిరి, రచ్చ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు.













