ఫిమేల్ సెంట్రిక్ సినిమాకి రెడీ అయిన పూజా హెగ్డే
హీరోయిన్లలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసేవారు చాలా తక్కువ. స్టార్ హీరోల సరసన కేవలం లవ్సీన్స్కి, పాటలకు మాత్రమే పరిమితమయ్యే హీరోయిన్లే ఎక్కువ. అయితే తెలుగులో విజయశాంతి అలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎన్నో చేసింది. తను హీరోయిన్గా నటించిన సినిమాల్లో సైతం హీరోతో సమానంగా ఆమెను కూడా అప్లాజ్ చేసేవారు ఆడియన్స్. విజయశాంతి తర్వాత ఆ తరహా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చెయ్యాలని, తాము కూడా విజయశాంతి అంతటి పేరు తెచ్చుకోవాలని చాలామంది హీరోయిన్లు ట్రై చేశారు. కానీ, ఏ ఒక్కరూ సక్సెస్ అవ్వలేదు.
ఇప్పుడు అలా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న వారిలో సౌత్‌లో నయనతార పేరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆమె కూడా హీరో పక్కన హీరోయిన్‌లాగే కనిపించినా ఆ తర్వాత తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని వరసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈమధ్యకాలంలో ఆమె హీరోలతో కలిసి చేసిన సినిమాల కంటే ఫిమేల్ సెంట్రిక్ మూవీసే ఎక్కువ శాతం విజయం సాధించాయి. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ తరహా సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది..
తమిళ చిత్రం ముగమూడితో హీరోయిన్గా పరిచయమైన పూజా హెగ్డే ఒకలైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్‌తేజ్‌తో ముకుంద చిత్రంలో నటించింది. ఆ రెండు సినిమాలూ విజయం సాధించలేదు. అయినా టాలీవుడ్లో కొన్ని అవకాశాలు వచ్చాయి. వాటిని కాదని మొహెంజెదారో చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్లో వాలిపోయింది. ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూడడంతో మళ్లీ టాలీవుడ్ వచ్చి దువ్వాడ జగన్నాథం చిత్రంలో నటించింది. ఆ తర్వాత వరసగా తెలుగులో సినిమాలు చేసింది. అల వైకుంఠపురములో చిత్రంతో పూజాకు హీరోయిన్గా మంచి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్‌తో ఓ సినిమా, అఖిల్‌తో ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో కభి ఈద్ కభి దివాలిలో కూడా నటిస్తోంది. పూజా కెరీర్ ఎంతో బ్రైట్‌గా ఉన్న ప్రస్తుత తరుణంలో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేయడానికి సిద్ధమవుతోంది. కృష్ణగాడి వీరప్రేమగాధ, లై, పడి పడి లేచె మనసు వంటి సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హను చెప్పిన లైన్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పిందట పూజ. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.













