పూజా చేతికి మరో బాలీవుడ్ ఆఫర్
గతేడాది వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు. 2023లో అమ్మడి నుంచి ఒక్క సౌత్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీన్ని బట్టే పూజా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాయి తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రానున్న గాంజా శంకర్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందనుకుంటే ఆ సినిమా ఆగిపోయిందంటున్నారు.
ఇక అసలు విషయంలోకి వస్తే పూజా హెగ్డే కు చాలా గ్యాప్ తో స్టార్ వారసుడి సరసన ఓ సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా నటించనున్న సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపికైంది. సాజిద్ నడియాడ్ వాలా బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇండియాతో పాటూ విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమాకు అద్నాన్ షేక్ – యాసిర్ ఝా దర్శకత్వం వహించనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. సంకీ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా అయినా పూజా హెగ్డేకు తను కోరుకునే బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం పూజా ఆశలన్నీ ఈ ప్రాజెక్టుపైనే ఉన్నాయి.













