ఏకే సినిమాలో ఆ విషయానికి భయపడుతున్నపీకే ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఒక మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు తెలుగు రీమేక్. ఈ సినిమాలో నిజాయితీతో పాటు ఇగోయిస్ట్ పోలీస్ గా పవన్ కనిపించనున్నాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు.
మలయాళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తున్నారని, పవన్ లాంటి కమర్షియల్ హీరో ఉండటం వల్ల ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ను యాడ్ చేస్తున్నామని రీసెంట్ గా నిర్మాత నాగవంశీ చెప్పాడు. ఇప్పుడు ఆ మాటే పవన్ ఫ్యాన్స్ కు భయాన్ని కలిగిస్తుంది. పవన్ ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కూడా పవన్ ఇమేజ్ ను మనసులో ఉంచుకుని చాలా మార్పులు చేసి, ఫ్లాష్ బ్యాక్ ను జత చేశారు.
ఫలితంగా వకీల్ సాబ్ సినిమా మొత్తంలో మైనస్ అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ గురించే చెప్పారు. ఫ్యాన్స్ కు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ అనవసరంగా పెట్టారనిపించిందంటే సినిమాకు అది ఎంత అడ్డుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ అంటుంటే ఫ్యాన్స్ భయపడుతున్నారు. కాకపోతే ఇక్కడ త్రివిక్రమ్ ఉన్నాడు కాబట్టి ఏదో మ్యాజిక్ చేస్తాడని ఆశగా ఉన్నారు. కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందోననే కలవరం మాత్రం వారికి అంతే ఉండిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే నెలాఖరుకు టాకీ పార్ట్ ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













