పెట్టా సెకండ్ లుక్ విడుదల
సూపర్‌స్టార్ రజనీకాంత్ నూతన చిత్రం పెట్టా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కాలా, 2.0 చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. కార్తీక్ సుబ్బరాజ్ (ఫిజ్జా ఫేమ్) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. డార్జిలింగ్‌లో మొదలుపెట్టి ఆ తర్వాత మధురైలలో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం వారణాసిలో తీసుకున్నారు. ఇదిలావుండగా, ఈ చిత్రం రెండవ లుక్‌ను విడుదల చేశారు. మాస్ లుక్‌లో రజనీకాంత్ చాలా సైలిష్‌గా ఉన్నారు. చిత్రంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో విజయ్ సేతుపతి, బాబీసింహా, మేఘాఆకాష్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.













