ఆ బ్యానర్ ఇకనైనా జాగ్రత్త పడితే బెటర్
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. ఆరేడేళ్ల నుంచే ఈ సంస్థ నిర్మాణ రంగంలో ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా ఈ బ్యానర్ రేంజ్ బాగా పెరిగింది. ఇంతకుముందు వరకు చిన్న సినిమాలనే నిర్మించే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ తో సినిమా చేసే స్థాయికి ఎదిగింది.
ఈ బ్యానర్ నుంచి గతేడాది వచ్చిన కార్తికేయ-2, ధమాకా సినిమాలే దీనికి కారణం. ఈ రెండు సినిమాలూ వంద కోట్ల సినిమాలు కావడంతో ఆ బ్యానర్ పేరు వార్తల్లో మార్మోగింది. ఇదే కరెక్ట్ టైమ్ అని భావించిన నిర్మాతలు ఒకే సారి చిన్న పెద్దా అని తేడా లేకుండా వరుసగా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలైన ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి వారితో కూడా సినిమాలను లైన్ లో పెట్టారు.
ఇక అసలు విషయానికొస్తే ఈ బ్యానర్ రేంజ్ అయితే పెరిగింది కానీ ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల క్వాలిటీ మాత్రం పడిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఈ సంస్థకు మంచి హిట్లు రాగా, ఈ ఏడాది మాత్రం వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయితో మొదలైన ఈ ఫ్లాప్‌లు, రీసెంట్గా రిలీజ్ అయిన బ్రో వరకు కొనసాగుతూనే ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నిర్మాణ సంస్థ ఇకనైనా క్వాలిటీ విషయంలో జాగ్రత్త పడటం మంచిది.













