సంచలన చిత్రం ‘పెదరాయుడు’కి పాతికేళ్లు
తెలుగు సినిమా చరిత్రలో `పెదరాయుడు` చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే మోహన్‌బాబు కెరీర్లో కూడా ఈ సినిమా ఓ మైల్స్టోన్ లాంటిది. 1995 జూన్ 15న విడుదలైన ఈ సినిమా నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తమిళ్లో రూపొందిన `నాట్టమై` చిత్రం అక్కడ సూపర్‌హిట్ అయి కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించగా ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని మోహన్‌బాబు భావిస్తే దానికి అతని మిత్రుడు రజనీకాంత్ ఎంతో సహకారాన్ని అందించారు. ఆ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పించడంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషించారు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఎన్నో సెంటర్స్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ సినిమాలో రజనీకాంత్ చేసిన అతిథి పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. పెదరాయుడు, చిరంజీవి నటించిన బిగ్‌బాస్ ఒకేరోజు విడుదలయ్యాయి. అయితే బిగ్‌బాస్ డిజాస్టర్ అయింది. `పెదరాయుడు` సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఎన్.టి.రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్‌బాబు, రజనీకాంత్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టి ఆశీర్వదించారు.
పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పెదరాయుడుగా, ఆయన తమ్ముడు రాజాగా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ముఖ్యంగా భార్య భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం, తల్లి తండ్రులతో కొడుకల అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. తమిళ్లో అప్పట్లో సాధారణ నటుడైన విజయ్‌కుమార్ చేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేయడం విశేషం. మోహన్‌బాబుతో అతనికి ఉన్న అనుబంధం కారణంగానే ఆ పాత్రను చేశారు. దానికిగాను రజనీకాంత్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఇక పెదరాయుడుగా నటించిన మోహన్‌బాబు అందరూ ఆశ్చర్యపోయేలా తన అభినయంతో ఆ పాత్రకు జీవం పోశారు.
తమిళ్లో ఈ సినిమా చూసిన మోహన్‌బాబు ఆ తర్వాత దర్శకుడు రవిరాజా పినిశెట్టిని చూడమని చెప్పారు. సినిమా చూసిన రవిరాజా బాగుందని చెప్పడంతో తెలుగులో తమ సొంత బేనర్లో రీమేక్ చేసేందుకు సిద్దమయ్యారు మోహన్‌బాబు. తెలుగులో రవిరాజానే డైరెక్ట్ చెయ్యమని చెప్పారు. అయితే ఈ సినిమా స్క్రీన్‌ప్లేలో కొన్ని మార్పులు చేయాలని, కథను తెలుగు నేటివిటీకి తీసుకు రావాలని దానికి ఓ పదిహేను రోజులు టైమ్ కావాలని రవిరాజా అడగడంతో మోహన్‌బాబు ఓకే చెప్పారు. సత్యమూర్తితో ఈ సినిమాకి మాటలు రాయించుకుని తాను అనుకున్న మార్పులు చేశారు రవిరాజా.
ఈ సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి జ్జాపకాలను రవిరాజా నెమరు వేసుకుంటూ `ఈ సినిమా తెలుగులో రూపొందడంలో సగభాగం క్రెడిట్ రజనీకాంత్‌గారికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పించడంతోపాటు సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాని తెలుగులో చేస్తే తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని నమ్మిన మోహన్‌బాబుగారికి కొంత క్రెడిట్ వెళ్తుంది. ఆ తర్వాత చక్కని మ్యూజిక్ ఇచ్చిన కోటి, అద్భతమైన నటనను ప్రదర్శించిన సౌందర్య, భానుప్రియ, రజనీకాంత్‌కి పర్ఫెక్ట్ వాయిస్‌ని ఇచ్చిన సాయికుమార్‌కి, చక్కని మాటలు రాసిన సత్యమూర్తిగారికి మిగతా క్రెడిట్ దక్కుతుంది“ అన్నారు.













