విభిన్నంగా ఆలోచించిన పాయల్
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల ఆర్థికంగా దేశానికి, ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతున్నప్పటికీ కొన్ని లాభాలు కూడా కలుగుతున్నాయన్న విషయాన్ని అందరూ గ్రహించారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండేవారికి తమ కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు కావాల్సిన సమయం చిక్కింది. దీనివల్ల మానవ సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడూ లేని విధంగా ఇంటిపట్టునే ఉండడం వారి వారి కుటుంబ సభ్యులకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దొరికిన ఈ సమయాన్ని సెలబ్రిటీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. తమకు నచ్చిన కళలను నేర్చుకుంటున్నారు. కొందరు సంగీతాన్ని నేర్చుకుంటూ ఉంటే కొంతమంది పెయింటింగ్‌పై తమ దృష్టి పెట్టారు. మరికొందరు తమకు నచ్చిన పాటలపై డాన్సులు చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు.
ఒక హీరోయిన్ మాత్రం దానికి భిన్నంగా ఆలోచించింది. ఒక ఫార్ట్ ఫిలిం చెయ్యాలనుకుంది. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ ఈ ఖాళీ సమయంలో షూటింగ్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అందుకే ది రైటర్ పేరుతో సౌరభ్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలిం చేసింది. విశేషమేమిటంటే 24 గంటల్లోనే ఈ షార్ట్ ఫిలిమ్‌ని పూర్తి చేశారు. దీన్ని అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.













