అనురాగ్ కశ్యప్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన పాయల్!
ఈమధ్యకాలంలో బాగా వెలుగులోకి వచ్చిన అంశం కాస్టింగ్ కౌచ్. దీని బారిన పడిన నటీమణులు వివిధ సందర్భాల్లో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది దర్శకులు, నటులు వచ్చిన సినిమాలను పోగొట్టుకున్నారు. కొంతమంది నిర్మాతలు స్వచ్ఛందంగానే వారిని తమ సినిమాల్లో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. కథ చెబుతానని తనను పిలిపించుకొని గదిలోకి తీసుకెళ్ళాడని, తను చేస్తున్న సినిమాలో అవకాశం ఇవ్వాలంటే తనతో బెడ్ పంచుకోవాలని అనురాగ్ కోరాడని పాయల్ ఆలోపించింది. ఆ సమయంలోనే తనను టచ్ చేయాలని చూశాడని, తను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశానని చెప్పింది. తన కెరీర్లో ఆ తర్వాత ఎవరూ అలా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది పాయల్. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొంది పాయల్.
అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసినందుకు తనను కొంతమంది ఫోన్ చేసి బెదిరించారని తెలిపింది. తనకు ప్రాణ రక్షణ కల్పించమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు తన లాయర్ ఓలేఖ రాయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ గురించి పాయల్ ప్రస్తావిస్తూ అనురాగ్‌కు డ్రగ్స్ వాడే అలవాడు ఉందో లేదో తనకు తెలియదని, అయితే తను అతన్ని కలిసినపుడు సిగరెట్ తాగుతున్నాడని, కానీ, మామూలు సిగరెట్ కాదని పేర్కొనడం గమనార్హం. అనురాగ్‌పై తను చేసిన ఆరోపణలను కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారని, అతనికి మద్దతుగా మాట్లాడారని తెలిపింది. పైగా తనను ఈ విషయంలో తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.













