ఓజీకి రెండు వారాలు చాలట!
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తైపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం పవన్ జస్ట్ రెండు వారాలు కేటాయిస్తే ఆయనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. గతంలో నాలుగు వారాలన్నారు కానీ ఇప్పుడు రెండు వారాలైతే సరిపోతుందని యూనిట్ వర్గ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్న పవన్, ఎలక్షన్స్ అయిపోతే కానీ తిరిగి సినిమాలకు డేట్స్ ఇవ్వలేడు.
సినిమాలో పవన్ కనిపించేది తక్కువైనా కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయనున్నాడట సుజిత్. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ కథ తెరకెక్కుతోంది. సాహో లో జరిగిన పొరపాట్లు ఈ సినిమా విషయంలో జరగకుండా ఉండేలా సుజిత్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియా రెడ్డి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













