అకీరాను నాయకుడిని చేస్తారా?
డాక్టర్ కొడుకు డాక్టర్ అవాలని లేదు. యాక్టర్ కొడుకు యాక్టర్ అవాలని లేదు. అవును. మనమొకటి తలస్తే దేవుడొకటి తలచాడంటారు. అచ్చం అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ విషయంలో కూడా. పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా వెండితెరపైకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ అకీరాకు హీరో అవాలని లేదని గతంలోనే తన తల్లి రేణూ దేశాయ్ క్లారిటీ ఇవ్వగా, ఇప్పుడు అకీరాను చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ ఆశ నిరాశగానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఏపీ ఎలక్షన్స్ లో భారీ విజయం సాధించిన పవన్ వెంట తన కొడుకు అకీరా కూడా తిరుగుతున్న వైనం చూస్తుంటే అకీరాకు పవన్ రాజకీయాలు అలవాటు చేస్తున్నాడేమో అనిపిస్తుంది.
ముందు నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసి ఆశీర్వదించమని కోరిన పవన్, ఆ తర్వాత ప్రధాని మోదీ దగ్గరకు కూడా తీసుకెళ్లి ఆయన కాళ్లకు నమస్కరింప చేసి, అశీర్వాదాలు అందుకునేలా చేశాడు. ఈ రెండు సన్నివేశాలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. నటుడిగా ఉన్నన్నిరోజులు కనీసం అకీరాను సెట్స్ కు కూడా తీసుకురాని పవన్, ఇప్పుడు రాజకీయాల్లోకి నేరుగా తీసుకురావడం వెనుక అర్థమేంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.
పవన్ తన రాజకీయ అనుభవాలన్నింటినీ ఇప్పటినుంచే కొడుక్కి నేర్పించి మంచి రాజకీయ నాయకుడిని చేయాలనుకుంటున్నాడా? అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం అకీరా వయసు 20 ఏళ్లు. వచ్చే ఎలక్షన్స్ నాటికి అకీరాకు 25 ఏళ్లు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ ఎన్నో సిట్యుయేషన్స్ లో పిలుపినిచ్చాడు. ఆ రీతిలో చూసుకుంటే వచ్చే ఎన్నికలకు పవన్, అకీరాను పొలిటికల్ బరిలోకి దించే అవకాశాలూ లేకపోలేదు. వచ్చే ఎలక్షన్స్ కు జనసేన తరపును 175 స్థానాల్లో పోటీ చేసేలా పార్టీని రెడీ చేయాలంటే ఈ టైమ్ లో పవన్ పక్కన కొడుకుగా అకీరా అవసరం ఎంతో ఉంది. అసలే రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేం. అవన్నీ దృష్టిలో ఉంచుకునే పవన్, అకీరాను తన వెంట తిప్పుతున్నాడా లేక గెలిచిన ఆనందంలో తీసుకెళ్తున్నాడా అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.













