Anna lezhneva: గుండు చేయించుకుని మొక్కులు తీర్చుకున్న పవన్ భార్య
ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండో కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల గాయపడిన విషయం తెలిసిందే. తమ కొడుకు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు పవన్ భార్య అన్నా లెజినోవా (Anna lezhneva) తిరుమల వెళ్లారు. కొడుకు మార్క్ శంకర్ త్వరగా కోలుకున్నందుకు గానూ అన్నా లెజినోవా ఈ మొక్కులు తీర్చుకున్నారు.
మొక్కులో భాగంగా తిరుమలలోని గాయత్రి సదనంలో అన్నా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా క్రిస్టియన్ కావడంతో గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో ఆమె డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఆలయ నియమాలను పాటిస్తూ అన్నా లెజినోవా ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఆ తర్వాత అన్నా లెజినోవా టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు భారీ విరాళం అందించారు. కొడుకు మార్క్ శంకర్ పేరిట ఇవాళ మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చు రూ. 17 లక్షలను అన్నా లెజినోవా విరాళంగా ట్రస్టుకు అందించి, ఆమె కూడా అక్కడే భోజనం చేసి, అక్కడి భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్నా లెజినోవా చేసిన పనికి అందరూ ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.













