చిరంజీవిని కలిసిన పవన్ కల్యాణ్ … ఘనంగా స్వాగతం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు, అగ్ర కథానాయకుడు చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్ వచ్చిన పవన్ కల్యాణ్ చిరంజీవి నివాసానికి వచ్చారు. మరోవైపు ఈ విజయోత్సవంలో భాగం అయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ చిరు ఇంటకి చేరుకున్నారు.
చిరు నివాసానికి వచ్చిన పవన్‌కు ఘన స్వాగతం లభించింది. తల్లి అంజనాదేవి పవన్, అన్నాలెజినోవో, అకీరాలకు గుమ్మడికాయతో దిష్టి తీయగా, పవన్ వదినలు నీరాజానాలు ఇస్తూ లోపలికి ఆహ్వానించారు. చిరంజీవి రాగానే నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా, పవన్ పైకి లేపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పైకి ఎగిరి మరీ చిరు పూలదండ వేయగా మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివెరిశాయి. ఈ సందర్భంగా కల్యాణ్‌బాబు హ్యాట్సాఫ్ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేసి పవన్ తన కుటుంబ సభ్యులకు తినిపించారు.













