శ్రీ చంద్ర మోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ నటులు శ్రీ చంద్ర మోహన్ గారు కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో నానావలిగా గుర్తుండిపోతారు.
శ్రీ చంద్ర మోహన్ గారితో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలుంటాయి. 900కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చేరువయ్యారు. శ్రీ చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)













