ఐపీఎల్ వేడుకలకు డుమ్మా కొట్టిన పరిణీతి
అంగరంగ వైభవంగా వేలాది మంది అభిమానుల మధ్య ప్రదర్శన చేయడానికి వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు. అనివార్య కారణాల వల్ల తప్పితే ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో పాల్గొనాలని భావిస్తారు. కానీ, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా మాత్రం ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రదర్శన చేసేందుకు ఇంకా సన్నద్ధం కాలేదని తప్పుకుంది. దాదాపు 15 రోజుల క్రితం ఆరంభోత్సవంలో పాల్గొనడానికి బాలీవుడ్ నటీనటులు రణ్‌వీర్‌సింగ్, వరుణ్ ధావన్, పరిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నా, ప్రభుదేవాతో పాటు పలువురు అంగీకరించారని బీసీసీఐ వెల్లడించింది. శనివారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మెగా ఈవెంట్ ప్రారంభమవుతుందనగా ఈవెంట్ నుంచి తప్పుకోవడంపై నటి ప్రతినిధి వివరణ ఇచ్చారు. పాటియాలలో నాన్ స్టాప్‌గా జరుగుతున్న నమస్తే ఇంగ్లాండ్ సినిమా షూటింగ్లో పరిణీతి పాల్గొంటున్నారు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఆమెకు తగినంతం సమయం లేదని నటి ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలు శనివారం సాయంత్రమే జరగనుండగా ఆమె స్థానంలో నిర్వాహకులు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.













