పవన్ ఫ్యాన్స్ గప్‌చుప్, పరాన్నజీవి పరిస్థితి? …
కొన్ని రోజులుగా పవర్‌స్టార్ సినిమాపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. తమ హీరోని ఎగతాళి చేసేందుకే ఈ సినిమా తీస్తున్నాడంటూ మండిపడ్డారు. సినిమాకి ముందుగా వీరి ఆగ్రహానికి వర్మ విడుదల చేసిన టీజర్, గడ్డి తింటావా పాట…వంటివి ఆజ్యం పోశాయి. ఎన్నడూ లేనిది బంజారాహిల్స్‌లోని వర్మ ఆఫీస్‌పై దాడి చేయడం, సాక్షాత్తూ ఓయూ జెఎసి సైతం వర్మకు వ్యతిరేకంగా పోరాటానికి సై అనడం… వంటివి ఉద్రిక్తత పెంచాయి. దానికి తోడు వర్మ కూడా యువతని రెచ్చగొట్టేలా మాట్లాడడంతో.. సినిమా విడుదల రోజున ఏమైనా జరిగే అవకాశం ఉంటుందేమోనని ఉత్కంఠ నెలకొంది.
ఏదైతేనేం వర్మ తన ఆర్జీవి వరల్డ్ ధియేటర్స్‌లో సినిమా విడుదల చేశాడు. దాంతో ఇంత సందడీ చప్పున చల్లారిపోయింది. ఆ సినిమాలో పవన్ దురభిమానులు ఆశించినట్టు పవన్ కళ్యాణ్‌పై ఎటువంటి వ్యంగ్యాస్త్రాలూ లేకపోవడం, పవన్ ఫ్యాన్స్ నొచ్చుకునేంత సీన్లు మచ్చుకు కూడా కానరాకపోవడం, పైగా ఎప్పుడూ కాలరెగరేసుకుని తిరిగే ఎంతటి సెలబ్రిటీతో గొడవకైనా సై అన్నట్టు ఉండే వర్మ లాంటి పొగరుబోతు దర్శకుడు సినిమాలోని తమ హీరో పాత్రధారి కాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడడం… వంటివి పవన్ అభిమానుల్ని షాక్‌కి గురి చేశాయి. ఇక ఈ సినిమాపై ధ్వజమెత్తడానికి గాని ఆగ్రహంతో ఊగిపోవడానికి గాని ఏమీ కనపడకపోవడంతో పవన్ అభిమానులు పూర్తిగా చల్లబడిపోయారు. మరోవైపు పవర్‌స్టార్ సినిమా ద్వారా పవన్ ఇమేజ్‌ని కాలరాస్తాడనే సందేహంతో వర్మని ఎద్దేవా చేస్తూ, ఎలా పడితే అలా తిట్టిపోస్తూ తీసిన పరాన్న జీవి సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పవన్ అభిమానుల్లో చాలా మందికి కొద్దో గొప్పో నచ్చేలాగా ఉన్న పవర్‌స్టార్ సినిమా పట్ల ఏ మాత్రం వ్యతిరేకత రాకపోవడంతో దాని మీదే ఆధారపడిన పరాన్నజీవి కి ముందుగానే ఫ్లాప్ టాక్ వచ్చేసింది.













