ప్రభాస్ ఓకే చెప్పకపోతే ‘ఆదిపురుష్’ అనే ప్రాజెక్టే ఉండేది కాదంటున్న ఓం రౌత్!
బాహుబలి తర్వాత తను చేస్తున్న ప్రతి సినిమాతోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత సాహో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పరచింది. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడం అభిమానులను నిరాశపరిచింది. బాలీవుడ్లో మంచి కలెక్షన్లు రాబట్టడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఇక ఈ సినిమా తర్వాత రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రాధేశ్యామ్. బాహుబలి, సాహో వంట సినిమాల తర్వాత ప్రభాస్ నటించే సినిమాకి రాధేశ్యామ్ అనే టైటిల్ పెట్టడం అభిమానులకు కాస్త మింగుడు పడని విషయమే అయినప్పటికీ సినిమాలో ఏదో విషయం ఉంటుంది కాబట్టే ప్రభాస్ ఒప్పుకున్నాడు అనే ధీమా కూడా వారిలో ఉంది.
ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ కాంబినేషన్లో అశ్వనీదత్ నిర్మించే సోషియో ఫాంటసీ సినిమాను కూడా ఎనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. ఇదిలా ఉండగా అనుకోకుండా ప్రభాస్ నటించే మరో భారీ సినిమా తెరపైకి వచ్చింది. `ఆదిపురుష్` పేరుతో రూపొందే ఈ సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనుంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మైథలాజికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు.
ప్రభాస్‌ని రాముడిగా చూపిస్తూ ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించబోతున్న దర్శకుడు ఓం రౌత్‌ను ఈ కాంబినేషన్ ఫిక్స్ అవ్వడం వెనుక కథ ఏమిటి అని ప్రశ్నించగా… “ఈ కథను ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను. నేను అనుకున్న క్యారెక్టర్‌కి ప్రభాస్ తప్ప మరొకరు సూట్ అవ్వరు అనిపించింది. ఎంతో కష్టపడి, మరెంతో రీసెర్చ్ చేసి ఈ కథను రెడీ చేశాను.
ఒకవేళ ఈ కథ నచ్చకపోవడం వల్లనో లేక మరి ఏ ఇతర కారణాల వల్లనో ఈ సినిమా చేయను అని ప్రభాస్ అంటే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా వెంటనే ఈ ప్రాజెక్ట్ ఆపేసేవాడిని. ఎందుకంటే.. ఈ సినిమా తీస్తే ప్రభాస్ తోనే తియ్యాలి అనే పట్టుదలతోనే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. నిజానికి ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన బిహేవియర్, స్టయిల్ అన్నీ నాకు బాగా నచ్చుతాయి. ఈ సినిమా తాజాజీ కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ, స్ర్కిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడం, కొంత రీసెర్చ్ కూడా పెండింగ్‌లో ఉండడం వల్ల ముందు తానాజీ చిత్రం చేశాను. ఇప్పుడు నా పూర్తి కాన్సన్ట్రేషన్ ఆదిపురుష్ మీదే. ప్రభాస్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామంటే అప్పడు నేను రెడీ“ అన్నాడు దర్శకుడు ఓం రౌత్.













