స్టార్ డైరక్టర్లందరితో ఎన్టీఆర్.. వాటే ప్లానింగ్ యమ
ఆర్ఆర్ఆర్ తో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో పొలిటికల్ డ్రామా చేయనున్నాడని, వీరి కాంబినేషన్ లో సెకండ్ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్.
వచ్చే యేడాది లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్న ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు, చౌడప్ప నాయుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడేమో ఆ సినిమా ఆగిపోయిందంటున్నారు. దీనిపై దర్శకనిర్మాతలు స్పందిస్తే తప్ప అసలు విషయమేంటనేది ఒక కొలిక్కి రాదు. త్రివిక్రమ్ తర్వాత కొరటాల తో కూడా ఒక మూవీ ఉందంటున్నారు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా ఉండనుందనేది స్వయంగా నిర్మాతలే చెప్పారు.
ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత రాజా రాణి డైరక్టర్ అట్లీతో కూడా యంగ్ టైగర్ సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. పోలీసోడు, అదిరింది, విజిల్ సినిమాలతో మంచి స్టార్ డైరక్టర్ గా పేరందుకున్న అట్లీ ఆ మధ్య ఎన్టీఆర్ తో బైలింగ్యువల్ ఫిల్మ్ తీస్తానని చెప్పాడు కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి క్లారిటీ మాత్రం రాలేదు. ఇవే కాకుండా ఖైదీ, మాస్టర్ సినిమాల డైరక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా సినిమా ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా స్టార్ డైరక్టర్లతో రానున్నాడు. మరి వీరిలో ఏ డైరక్టర్ తో ఎన్టీఆర్ ముందుగా సెట్స్ మీదకు వెళతాడో చూడాలి.













