Saamrajyam: శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’, తెలుగులో ‘సామ్రాజ్యం’ టైటిల్

శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ సినిమా నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ‘అరసన్’, తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) టైటిల్ ఖరారు చేశారు.
‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ అందించారు. “శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉందని, వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారని” ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రోమో లేదా టీజర్ రెండు మూడు నిమిషాల నిడివిలో ఉంటాయి. అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల వీడియో విడుదల చేసింది ‘సామ్రాజ్యం’ చిత్ర బృందం.
‘సామ్రాజ్యం’ ప్రోమో ప్రారంభంలో విజువల్స్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కోర్టు బయట తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఓ వ్యక్తి కథ చెబుతున్న దృశ్యంతో ప్రోమో ప్రారంభమైంది. ‘సార్… నేను చెప్పబోయే మ్యాటర్ మొత్తం రియాలిటీ. నరికినోళ్లు, చచ్చినోళ్ళు, స్థలం, పేరు, టైం, ఊరు… మొత్తం రియాలిటీనే. కానీ మీరు అలా చూపించకండి. ఈ సినిమాలో వచ్చేదంతా ఉట్టి భూటకం అని కార్డు వేస్తారు కదా! అలా వేయండి’ అని శింబు చెబుతుంటారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ అయితే అదరగొడతారని చెబుతారు. ఆ తర్వాత కోర్టులో వాయిదాకు సమయం కావడంతో వెళతారు. ముగ్గురు మనుషుల్ని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో ఆయన ముద్దాయి. అయితే తాను ఎవరినీ చంపలేదని, తనపై అన్యాయంగా కేసు బనాయించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు శింబు. ప్రోమోలో రెండు భిన్నమైన గెటప్పుల్లో ఆయన కనిపించారు. కోర్టు సన్నివేశాల్లో కాస్త నెరిసిన గడ్డంతో, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో యువకుడిగా ఉన్నారు. ఆ కేసు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘వడచెన్నై’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ‘వడ చెన్నై’ ప్రపంచంలో ఎవరికీ చెప్పని కథ అంటూ ప్రోమో చివర్లో వేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు ‘వి క్రియేషన్స్’ అధినేత కలైపులి ఎస్ థాను. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.