శ్రీవారి సేవలో ఎన్టీఆర్ చిత్రబృందం
తిరుమల శ్రీవారిని ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రబృందం దర్శించుకుంది. నటుడు నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్, సాయి కొర్రపాటి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలవుతున్న కారణంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు.













