నభూతో నభవిష్యతి ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, మహానాయకుడు
ఈ విశ్వం వున్నంతవరకు ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెలుగువారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్, స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు (‘ఎన్.టి.ఆర్’) అనే మూడక్షరాలను మరువరు మరవలేరు. ఆలాంటి కథానాయకుడు, మహానాయకుడు బయోపిక్ ని ఎన్.టి.ఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తూ ఎన్ బి కె ఫిలిం, పతాకం పై నిర్మిస్తున్నాడు. వరాహీ చలన చిత్ర , మరియు వైబ్రి మీడియా బ్యానర్లు పై సాయి కొర్రపతి రంగనాథ మరియు విష్ణు ఇందూరి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ తో గౌతమి పుత్ర శాతకర్ణి కి దర్శకత్వం వహించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర సంపూర్ణం గా చూపించడం కేవలం మూడు సరిపోదు. అందుకనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయటానికి నిర్ణయించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 24 న ‘ఎన్.టి.ఆర్’ మహానాయకుడు చిత్రాలను విడుదల చేస్తారు.
ఎన్. టి. ఆర్. ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక చిత్రాలలో నటించటమే కాక, ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎందరికో స్పూర్తి నిచ్చారు. అప్పటివరకూ ఎం యల్ ఏ., యంపీ, సి యమ్, పి యమ్ గవర్నర్ మరియూ రాష్ట్రపతి లాంటి రాజకీయ పదవుల్లోని తేడాపై ధ్యాసే పెట్టని మహా నటుడు ఎన్ టి ఆర్. ఎం జి ఆర్ సూర్తితో.. ‘తెలుగు’ ప్రజానీకానికి, తనకున్న తిరుగులేని జనాకర్షణ శక్తితో ఆత్మీయ ‘అన్న’గా దగ్గరై, ప్రజల్లో ‘రాజకీయ చైతన్యం’ తీసుకురావటమే కాక, ‘ఆత్మగౌరవం’ నినాదంతో, అప్పటివరకూ ‘మదరాసీ’లుగా పిలువబడుతున్న ‘తెలుగు జాతి’కీ, ‘తెలుగు భాష’కీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపునీ తెచ్చారు. ఆయన తన తెలుగు దేశం పార్టీ పరిపాలనలో తీసుకున్న సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు మరియూ సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎందరో రాజకీయవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
‘కా’రణ’జన్ములు’, ‘యుగపురుషులు’ ఎప్పుడూ సందేశాలు ఇవ్వరు. కానీ, తమ తమ జీవనవిధానాల ద్వారా మనకి స్పూర్తినిచ్చే ఆశయాలని, మన మధ్య వదిలి ‘భువి’ నుండీ ‘దివి’కి పయనమవుతారు. అలా ఆయన వదిలిన ఆశయాలలో మచ్చుకకి కొన్ని..
ఏ పనినైనా ‘అంకితభావం’తో చేయడం..
ఆ పని ఎంత ‘కష్టమైనా ఇష్టపడి’ చేయటం..
ఆ పనిని సాధించటంలో ‘మడమ తిప్పకుండా పోరాటం’ చెయ్యటం..
ఇక్కడ ‘అమలాపురం’లోని ‘రిక్షాపుల్లర్’ నుండి, ఎక్కడో ‘అమెరికా’లో ఉంటున్న ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్’ వరకూ, ప్రపంచవ్యాప్తంగా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న, ఎంతో మంది ‘తెలుగు’ వాళ్ళకు, ఆయన తన ఆశయాల ద్వారా స్పూర్తినిచ్చారు.
అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన ‘మహాభారతం’, ‘భాగవతం’, ‘రామాయణం’లోని పాత్రలకు తన సినిమాల ద్వారా సజీవ రూపకల్పన చేసి, రాజు పేద, కులం మతం అనే తేడా లేకుండా ప్రతి పాత్రలో జీవించాడు. మన కళ్ళముందు కదలాడారు. తన 60 ఏళ్ళ వయస్సులో, ఆ రోజుల్లో మన ‘తెలుగు’నాట ఉన్న గతుకుల రోడ్లల్లో, ‘చైతన్యరధం’ పైభాగానే కూర్చొని తిరుగుతూ, ప్రతీ కిలోమీటరుకూ వేలాదిగా, లక్షలాదిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, ‘చైతన్యరధం’ పైనే నిలబడి తన ప్రసంగాల ద్వారా వాళ్ళల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు. భావితరాల వాళ్ళు ‘మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణశక్తి సాధ్యమా’ అని కలలో కూడా ఊహించుకోలేనటువంటి అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక ‘కా’రణ’జన్ముడి’లా, ‘యుగపురుషుడి’లా, ఓ ‘దైవం’లా అవతరించారు.
ఇప్పటివరకు ఈ చిత్రంలో ఏ నటి నటులు ఏ పాత్రా పోషిస్తున్నారో చూద్దాం శ్రీమతి నందమూరి బసవ తారకం గా విద్యా బాలన్, రెండవ భార్య లక్ష్మి పార్వతి గా ఆమని, నందమూరి హరి కృష్ణ గా కళ్యాణ్ రామ్, నారా చంద్రబాబు నాయుడు గా దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వర రావు గా యార్లగడ్డ సుమంత్, సావిత్రి గా నిత్యా మీనన్, శ్రీ దేవి గా రకుల్ ప్రీత్ సింగ్, జయ ప్రద గా తమన్నా భాటియా, నారా భువనేశ్వరి గా మంజిమ మోహన్, గారపాటి లోకేశ్వరి గా పూనమ్ బజ్వా, దగ్గుబాటి పురందేశ్వరి హిమాంశు చౌదరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు గా భరత్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు గా సచిన్ కేధడ్కర్, యచ్ యం రెడ్డి గా కైకాల సత్యనారాయణ, నాగి రెడ్డి గా ప్రకాష్ రాజ్, యల్ వి ప్రసాద్ గా జిస్సు సేన్ గుప్త, పింగళి నాగేంద్ర రావు గా సంజయ్ రెడ్డి, ఆలూరి చక్రపాణి గా మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు ఇంకా కొన్ని పాపులర్ పాత్రల షూటింగ్ జరగుతుంది.













