రివ్యూ : తెలుగు ప్రేక్షకుడి తాట తీసిన ‘నోటా’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
బ్యానర్ : స్టూడియో గ్రీన్, విడుదల : ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలిమ్స్
నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాడ, సత్యరాజ్, నాజర్,యషిక ఆనంద్, సంచనా నటరాజన్,
అనస్టాసియా మాస్లోవ, యం యస్ భాస్కర్, ప్రియదర్శి పులికొండ తదితరులు నటించారు.
సంగీతం : సి యస్ సామ్, పాటలు: శ్రీ మణి, రాజేష్ ఏ మూర్తి
సినిమాటోగ్రఫర్ : యస్ కృష్ణ రవిచంద్రన్, ఎడిటర్ : రేమండ్ డెరిక్ కేసా
కథ, మాటలు: షాన్ కరుప్పుస్వామి, ఆనంద్ శంకర్
నిర్మాత : జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం : ఆనంద్ శంకర్
విడుదల తేదీ: 05.10.2018
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మాతగా, ఆనంద్ శంకర్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నోటా’. విడుదలకు ముందు ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. వరస విజయాలతో ముందుకెళుతున్న విజయ్ కి ఈ సారి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) ఓ కేసు విషయమై జెలుకి వెళ్లాల్సి రాగా రెండు వారాల కోసం తన కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ)ని సిఎం చేస్తాడు. రెండు వారాల పాటు సిఎంగా ఇంట్లో ఉండి రాష్ట్రాన్ని నడిపించిన సిఎం అనుకోకుండా వాసుదేవ్ కు శిక్ష పడిందని తెలుసుకుని అసలైన రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ క్రమంలో తండ్రి మీద కొందరు ఎటాక్ చేస్తారు. ఇక వరుణ్ సిఎంగా పూర్తిస్థాయి బాధ్యతలతో పాలన సాగిస్తాడు.
ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వారు వరుణ్ ను టార్గెట్ చేయడం ప్రజల్లో అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేస్తుంది. దాన్ని నుండి కూడా తెలివిగా తప్పించుకున్న వరుణ్ తండ్రి వాసుదేవ్ వేల కోట్ల డబ్బు గురించి తెలుసుకుంటాడు. అసలు ఆ డబ్బు ఎక్కడిది..? ఎవరి దగ్గర ఉంది..? సిఎంగా తండ్రికి వ్యతిరేకంగా మారిన వరుణ్ ఏం చేశాడు అన్నదే మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫామెన్స్:
వరుస విజయాలతో దూసుకెళ్తూ… ఒకో సినిమాకు మరింత ఎదుగుతూ కొత్తదనం చూపించే విజయ్ దేవరకొండ నోటా కథ ఎంచుకోవడం గొప్ప విషయం. ఇక వరుణ్ పాత్రలో విజయ్ తన ప్రతిభ కనబరిచాడు. తనదైన స్టైల్ లో విజయ్ నటించి మెప్పించాడు. అయితే దర్శకుడు హీరో పాత్రని ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక సినిమాలో నాజర్, సత్యరాజ్ పాత్రలు అలరించాయి. అయితే నాజర్ కు సెకండ్ హాఫ్ లో వేసిన మేకప్ సరిగా అనిపించదు. సత్యరాజ్ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఎందుకు ఈ సినిమాలో ఉందో అర్ధం కాదు. చిన్న పాత్రలో ఆమె అసలేమాత్రం అవసరం లేదు అనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు కూతురు కళగా నటించిన అమ్మాయి బాగా చేసింది.
సాంకేతిక వర్గం పని తీరు:
టెక్నికల్ టీం విషయానికొస్తే… ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. ఉన్న కంటెంట్ ను ఆనంద్ శంకర్ స్క్రీన్ పై ఆసక్తి కరంగా మలచలేకపోయారు. సి యస్ సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు.
యస్. కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ గొప్పగా లేదు సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విశ్లేషణ:
పొలిటికల్ థ్రిల్లర్ మూవీస్ అనగానే లీడర్, భరత్ అనే నేను సినిమాలు రిఫరెన్స్ గా తీసుకుంటారు. అయితే నోటా అంటూ విజయ్ కొత్తగా వస్తాడు అనుకుంటే పేలవమైన కథ, కథనాలతో వచ్చాడు. తండ్రి వారసత్వాన్ని అందుకుని సిఎంగా మారిన హీరో ఎలా తన ప్రస్థానం సాగించాడు నోటా కథ.
ఈ చిత్రం లో కథ, కథనాలు అన్ని తమిళనాడు రాజకీయాలకు సంబందించినట్టుగా ఉంటాయి. మరి ఒరిజినల్ బ్యానర్ తమిళ్ సినీ రంగానికి చెందిందే కాబట్టి ఇక్కడ డబ్బింగ్ సినిమాగా అనిపిస్తుంది. సినిమాలో మొదటి భాగ కాస్త ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. సినిమాలో విజయ్ ను కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సత్య రాజ్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. సినిమా రన్ టైం ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన నోటా సగటు సిని ప్రేక్షకుడిని కూడా మెప్పించడంలో విఫలమైందని ఘంటాపధంగా చెప్పొచ్చు. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.
తీర్పు :
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘నోటా’ చిత్రం విడుదలకు ముందు వున్నా అంచనాలను ఏ మాత్రం అందుకోలేక విఫలమైంది. దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ రాజకీయాల్లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను ఆసక్తికరంగా చూపించలేకపోయారు. కథనం కూడా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. పైగా ఇది మన సినిమా లా అనిపించకపోవడం… సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపించడంతో ప్రేక్షకుడు సహనం కోల్పోయాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయినా ఈ ‘నోటా’ చిత్రం డైరెక్ట్ గా చెప్పాలంటే సినిమా బాగోలేదు.