సినిమా హాళ్లు మూత లేదు: మంత్రి తలసాని
కరోనా విజృంభణ మళ్లీ పెరుగుతుండటంతో అక్కడక్కడా లాక్ డౌన్ ప్రతిపాదనలు వస్తున్నాయి. తెలంగాణ లో కూడా రోజు రోజుకీ కేసులు పెరుగుతూన్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించారు కూడా. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లు కూడా మూసి వేస్తారంటూ రూమర్లు కూడా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో థియేటర్లను మూసివేయకపోయినా, కనీసం సగం సీట్లు మాత్రమే నింపేలా నిబంధనలు విధించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ థియేటర్లను కూడా మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.
తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, ఎప్పటిలాగే థియేటర్లు ఓపెన్ ఉంటాయని, థియేటర్లను మూసివేస్తే, సినీ పరిశ్రమ మళ్లీ భారీ నష్టాల్లోకి వెళ్తుందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. కాబట్టి ఈ రూమర్స్ ను ఎవరూ నమ్మొద్దని, ప్రభుత్వ గైడ్ లైన్స్, కోవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్లు యధాతథంగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.













