గేమ్ ఛేంజర్ ఇకనైనా క్లారిటీ ఇస్తే బెటర్
టాలీవుడ్ లో త్వరలో రిలీజ్ కానున్న ప్యాన్ ఇండియా సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజి సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 ఆగస్ట్ 15న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతామని చెప్తున్నారు.
ఇవన్నీ గేమ్ ఛేంజర్ కంటే ముందే మొదలైన సినిమాలు. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందనేది ఇంకా తెలియదు. ఫలానా చోట షూటింగ్ జరుగుతుందని మేకర్స్ ఎప్పుడో ఓసారి అప్డేట్ ఇవ్వడమే తప్పించి షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనేది మాత్రం చెప్పడం లేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ కు గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయాలనేది దిల్ రాజు టార్గెట్. శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాదు. మరోవైపు చూస్తుంటే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్లు లాక్ చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా ఉండి చివర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మంచి డేట్ కావాలంటే ఇబ్బందే.
మొన్న సంక్రాంతికి దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమా లేకపోయినా ఎంత రచ్చయిందో చాలా దగ్గర నుంచి చూశాడు. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ క్లాష్ కుదరదు. డిసెంబర్ అంటే నెలాఖరులో రావాల్సి ఉంటుంది. ఏదేమైనా రిలీజ్ డేట్ గురించి గేమ్ ఛేంజర్ టీమ్ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇప్పటికే సినిమా మొదలై మూడేళ్లకు పైగా అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై అందరికీ చాలా అంచనాలున్నాయి. మరి గేమ్ ఛేంజర్ నుంచి ఆ అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.













