పెళ్లి ఘనంగా జరగాలంటే..!
లాక్డౌన్ వల్ల అన్ని శుభకార్యాలూ ఆగిపోయాయి. ముఖ్యంగా ముందే ఫిక్స్ చేసుకున్న పెళ్లిళ్లు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే ఈమధ్యే హీరో నిఖిల్ పెళ్లి ఒక వాయిదా పడిన తర్వాత మే 14న ఎట్టకేలకు జరిగింది.
ఇప్పుడు హీరో నితిన్‌కి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 15న నితిన్, షాలిని కందుకూరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ఓ స్టార్ హోటల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించింది ఈ జంట. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. పెళ్లి చేసుకోవాలన్నా ఘనంగా చేసుకోవడానికి వీలు లేదు. దీంతో పెళ్లిని ఇరు కుటుంబాల వారు వాయిదా వెయ్యాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి పెద్ద గేదరింగ్తో, ఆట్టహాసంగా జరగాలని ఈ జంట భావిస్తోంది. అయితే అది ఇప్పట్లో జరిగేలా లేదు. అందుకే డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు నితిన్, షాలిని. వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వారి కుటుంబ సభ్యులు చెయ్యాల్సి ఉంది. మరో హీరో రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం కూడా డిసెంబర్లోనే జరగనుంది.













