నా డ్రెస్ ఎవరి సొంతం అవుతుందో!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని కట్టడి చేసేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే.. లాక్డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకునేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ, హీరోయిన్ నిత్యమీనన్ అలా కాదు.
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ ఒక్కసారి కూడా సోషల్ మీడియా వేదికపైకి రాలేదు. ఎలాంటి పోస్టులూ పెట్టలేదు. అయితే సడన్‌గా ఆమె సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఓ వీడియో విడుదల చేసింది. దాని సారాంశమేమిటంటే తను లాక్మే ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడిచానని, అప్పుడు తాను ధరించిన డ్రెస్‌ను ఈరోజు అంటే మే 17న సాయంత్రం 4 గంటలకు వేలం వేస్తున్నానని ప్రకటించింది (పైన కనిపిస్తున్న డ్రెస్ ఆ ఫ్యాషన్ షో లోనిదే). ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని కరోనా బారిన పడిన గ్రామాల ప్రజల కోసం వినియోగిస్తానని తెలిపింది. ఆ మొత్తాన్ని అర్పణం ట్రస్ట్‌కు అందిస్తానని ప్రకటించింది. తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ అనీ, దాన్ని ఎవరు సొంతం చేసుకుంటారోననే ఉత్కంఠ తనలో మొదలైందని చెప్తోంది నిత్య. మరి నిత్యా మీనన్ డ్రెస్‌ను సొంతం చేసుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత తెలుస్తుంది.













