సినిమా బ్యాక్ గ్రౌండ్ తో మరో హీరో ‘నితిన్’ వస్తున్నాడు
నార్నె ఎస్టేట్స్ శ్రీనివాస రావు గురించి తెలియనివారు వుండరు అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ మామ గారు అనే విషయం కూడా తెలిసిందే. ఇంతకీ ఈ ప్రస్తావన దేనికంటారా? సినిమా రంగంతో ఏ మాత్రం బీరకాయ పీచు సంబంధం వున్నా, హీరో అయిపోవాలనుకునే కుర్రాళ్లకు లోటు లేదు. అందులో ఆర్ధికంగా స్థిరపడిన వారెవరైనా అసలు సంబంధం లేకుండానే హీరో కావాలని కలలు కనేవారు ఎందరో బడా బాబుల బాబులు కూడా వున్నారు. అలాంటిది ఓ టాప్ హీరో బావమరిది అయితే ఇంక ఆశపడడంలో తప్పేం వుంది? అందుకే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే కూడా హీరో కావాలని అనుకుంటున్నాడేమో? ఎన్టీఆర్ బావమరిది అంటే. ఇప్పుడు ఈ కుర్రాడిని హీరో చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
మరి ఎన్టీఆర్ కు తెలుసో లేదో, ఎందుకంటే ఎన్టీఆర్ తలుచుకుంటే కాస్త పెద్దగానే లాంచ్ చేయగలరు. లేదూ కుర్రాడు తన స్వంత ఇంట్రస్ట్ తో హీరోగా ఏదోలా ప్రారంభం కావాలి అనుకుంటే అది వేరేగా వుంటుంది. కుర్రాడు ఎలా వుంటాడు అన్నది ఇంకా జనాలకు పెద్దగా పరిచయం లేదు. అలాగే హీరో మెటీరియల్ వుందా లేదా అన్నది కూడా ఇంకా తెలియదు. ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని మాత్రం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీస్ నుంచి ఇలా హీరోల పరిచయాల పరంపర ఎప్పుడు ఉండేదే ? అయినా హీరోగా పరిచయం కావడానికి పరిచయాలు పనికి వస్తాయి. కానీ ఎవరు వచ్చినా తమ తమ స్టామినా రుజువు చేసుకుంటేనే ఇక్కడ నిలదొక్కుకోగలరు. లేదూ అంటే కొన్ని సినిమాలకే పరిమితం అవుతారు.













