సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన `నిశ్శబ్దం` చిత్రానికి బుల్లితెరపై అంత ఇంపాక్ట్ ఉంటుందా?
ఎంత ఆలస్యమైనా మా సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తాం, ఓటీటీ జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. థియేటర్లో చూస్తే వచ్చే ఇంపాక్ట్ బుల్లితెరపై రాదు… ఇలా కొంత మంది నిర్మాతలు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా, తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నవంబర్‌లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్త ఒక ప్రచారంలో ఉంది. అయితే ఎంతవరకు నిజమో తెలీదు. అందుకే ఈమధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్యం పెరిగింది. తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌కి రెడీ అయింది. ఓటీటీ సంస్థలు ఈ సినిమా కోసం పోటీ పడ్డాయి. కానీ, దర్శకనిర్మాతలు మాత్రం థియేటర్లో రిలీజ్ చేస్తామని పట్టుపట్టారు. నిజానికి అలాంటి సినిమా థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు. అందుకే ఎంత నష్టమైనా థియేటర్లోనే రిలీజ్ చెయ్యాలనుకున్నారు.
ఇక ఇప్పుడు ఓటీటీ తప్ప మరో మార్గం లేదని గ్రహించిన నిర్మాతలు తమ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో అనుష్క తో పాటు మాధవన్, అంజలి, శాలినీ పాండే ప్రధాన పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్ మల్టీ లాంగ్వేజ్ లో ఈ సినిమాని నిర్మించారు. బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత అనుష్క నటించిన సినిమా ఇదే కావడంతో ఆడియన్స్‌లో ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దర్శకనిర్మాతలు భావించినట్టుగా బుల్లితెరపై ఈ సినిమా ఇంపాక్ట్ అంతగా ఉంటుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు సినిమా ఏదీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. `నిశ్శబ్దం` చిత్రానికి ఉన్న ఎక్సపెక్టేషన్స్ వల్ల సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాల అంచనా. ట్రైలర్ చూసిన తర్వాతే అందరూ ఈ అభిప్రాయానికి వచ్చినట్టు అర్థమవుతోంది. హాలీవుడ్ రేంజ్లో ఉన్న పిక్చరైజేషన్ కూడా సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది అంటున్నారు.













