స్పై మూవీతో కళ్యాణ్ రామ్‌కు తిప్పలు
గతేడాది కార్తికేయ-2 సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు నిఖిల్ స్పై అనే మరో పాన్ ఇండియన్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అనుకోకుండా కార్తికేయ2 పెద్ద స్థాయిలో హిట్ అయింది కానీ రిలీజ్ కు ముందు ఎవరూ దాన్ని బహుభాషా చిత్రంగా అనుకోలేదు.
కార్తికేయ2 అనుకోకుండా హిందీలో మంచి విజయాన్ని అందుకోవడం ఇప్పుడు స్పై కి ప్లస్ అయింది. దీన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా స్పై టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారని టీజర్ చూస్తుంటేనే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకూ, టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో సినిమా కథకు పోలికలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో చర్చలు నడుస్తున్నాయి. ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు అందరూ భావించే సుభాష్ చంద్రబోస్ విషయంలో అసలేం జరిగిందనే నేపథ్యంలో ఓ గూఢచారి చేసే సాహసాల నేపథ్యంలో స్పై సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక పోతే కళ్యాణ్‌రామ్ హీరోగా వస్తున్న డెవిల్ స్టోరీ కూడా దాదాపుగా ఇలాగే ఉండనుందని అంటున్నారు. కాకపోతే అది వర్తమానంలో నడిచే కథ కాదని, పీరియడ్ ఫిల్మ్ అని అంటున్నారు.
డెవిల్ లో కూడా హీరో గూఢచారే. అక్కడ కూడా సుభాష్ చంద్రబోస్ చుట్టూనే కథ తిరుగుతుందని టాక్. ఒకే ఇండస్ట్రీలో ఈ రెండు కథల మధ్య సారూప్యతల గురించి ఇప్పటికే చాలా పెద్ద చర్చ నడుస్తోంది. రీసెంట్ గా స్పై టీజర్ లాంఛ్ లో ఇదే ప్రశ్న నిఖిల్ ను అడగ్గా, తమ సినిమాకూ, డెవిల్కూ అసలు పోలికే లేదని, రెండు వేరు వేరు కథలని తేల్చి చెప్పాడు. అయినా సరే ఈ వార్తలు మాత్రం ఆగట్లేదు. ఎలాగూ స్పై ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి, స్పై వల్ల డెవిల్ కు తిప్పలు తప్పవని అంటున్నారు విశ్లేషకులు.













