మెగా హీరో చేయని సినిమా ఒప్పుకున్న యంగ్ హీరో
యంగ్ డైరకర్లను కలుపుకుని, కొత్త నిర్మాతలను పట్టుకుని ప్రాజెక్టులను సెట్ చేసుకోవడంలో నిఖిల్ ముందు ఉంటాడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న నిఖిల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. బన్నీ వాస్ నిర్మాణంలో 18 పేజెస్ చేస్తున్నాడు నిఖిల్. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది.
దీంతో పాటూ కార్తికేయ2 కూడా సెట్స్ పైనే ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో ఇప్పటికే వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ తిరిగిన కథ ఇప్పుడు ద్వాపర యుగం నాటి ఒక రహస్యం చుట్టూ తిరగనుంది. ఈ ఏడాదిలోనే కార్తికేయ2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తప్పకుండా నిఖిల్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని బాగా ధీమాగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నిఖిల్ మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
మెడికల్ రంగంలో సాగే మోసాలు, ఆ వెనుక జరుగుతున్నఅవినీతి సామ్రాజ్యం గురించిన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందట. కోన వెంకట్ రాసిన ఈ కథ మొదట సాయి తేజ్ దగ్గరికి వెళ్లిందట. తనకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పలేదట. దీంతో ఆ స్టోరీ నిఖిల్ దగ్గరకు వస్తే.. నిఖిల్ వెంటనే ఓకే చేశాడట. దీనికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.













