అన్ని అనుమానాలను తీర్చేసిన నిఖిల్
కార్తికేయ2 సినిమాతో నిఖిల్ సిద్దార్థ్ సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాకు ముందు తెలుగు వాళ్లకు మాత్రమే సుపరిచితుడైన నిఖిల్, కార్తికేయ2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ఆసక్తి కలిగిస్తున్న సినిమా స్వయంభు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే మంచి ఆసక్తి కలిగించింది. ఓ పెద్ద హీరో చేయాల్సిన స్కేల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. యుద్ధ వీరుడి గెటప్ లో నిఖిల్ అసలు సెట్ అవుతాడా అని అనుమానపడిన అందరికీ ఈ లుక్ చూశాక ఓ క్లారిటీ వచ్చింది.
ఇప్పటివరకు పక్కంటి కుర్రాడిగా కనిపించిన నిఖిల్, స్వయంభు కోసం తనను తాను చాలా బాగా మేకోవర్ చేసుకున్నాడు. కండలు తిరిగిన దేహం, జులపాల జుట్టుతో పాత కాలం నాటి బట్టలతో యుద్ధ వీరుడిగా నిఖిల్ లుక్ చాలా బాగా సూటయింది. ఒక సామాన్యుడిగా మొదలుపెట్టి తనకు తానుగా గొప్ప యోధుడిగా ఎదిగే ఓ కుర్రాడి కథతో స్వయంభు తెరకెక్కుతోంది. చోళుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అప్పటి వాతావరణాన్ని తలపించేలా సెట్స్ వేసి మరీ ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. స్వయంభు ఈ ఏడాది ఆఖరిన ప్రేక్షకుల ముందుకు రానుంది.













