నిహారిక కొణెదల పెళ్లి ముహూర్తం 9 డిసెంబర్ 2020 : తేదీ ప్రకటించిన నాగ బాబు
* ఆగస్టులో జరిగిన నిహారిక, చైతన్యల వివాహ నిశ్చితార్థం
* ఉదయ్ పూర్, ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక-చైతన్యల వివాహం
* ముహూర్తం : డిసెంబర్ 9 రాత్రి 7.15 నిమిషాలకు
మెగా డాటర్ నిహారిక పెళ్లి తేదీ ఖరారైంది. ఈ సందర్భంగా నాగబాబు ఈ రోజు (బుధవారం) పెళ్లి తేదీని ప్రకటించారు. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరుగబోతుందన్న విషయం తెలిసిందే! మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 13న నిహారిక, చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. అప్పటి నుంచి వీరి వివాహ తేది, వేదిక గురించి రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. మొత్తానికి నిహారిక పెళ్లి తేదీ, వేదికను మెగా ఫ్యామిలీ ఖరారు చేసింది. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది.
ఈ విషయాన్ని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు. బుధవారం ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లిశుభలేఖను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అలాగే వివాహాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడే ఈ జొన్నలగడ్డ వెంకట చైతన్య. సరిగ్గా లాక్డౌన్ సమయంలో నిహారిక తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. ఆ తరవాత కొన్ని రోజులకే వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలు అమలులో ఉండటంతో కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలంతా ఈ వేడుకకు హాజరయ్యారు.
చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ నుంచి సడలింపులు ఉన్నా ప్రస్తుత కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ మెగా ఈవెంట్‌ను ఉదయ్‌పూర్‌లో ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడైతే అభిమానుల తాకిడి ఉండదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ వెడ్డింగ్‌కు ఉదయ్‌పూర్ కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ‘సిటీ ఆఫ్ లేక్స్’గా పిలుచుకునే ఉదయ్‌పూర్‌లో ఇండియాలోనే పేరుమోసిన స్టార్ హోటల్స్ బోలెడున్నాయి. ఇండియాలో డెస్టినేషన్ మ్యారేజ్‌కి పర్ఫెక్ట్ ప్లేస్ ఉదయ్‌పూర్. ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో భారీతనం కనిపిస్తుంది. అందుకే, మెగా ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌ను ఎంపిక చేసుకున్నట్టుంది.













