భర్త సినిమా అయినా తగ్గేదేలే అంటున్న నయన్
లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని నయన్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుంది. తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్గా లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సినిమా మొదలైంది.
ఈ సినిమాలో హీరోకు అక్క పాత్రలో నటించడానికి నయనతార ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఎస్ జె సూర్య కూడా ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో సినిమాకు అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి నయన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా బడ్జెట్ ఎక్కువై పోయిందన్న కారణంతో నయన్ను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్మాతలు అడిగ్గా ఆమె దానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. తన భర్త విఘ్నేష్ కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైనప్పటికీ పారితోషికం విషయంలో వేరే మాటే లేదని నిర్మొహమాటంగా చెప్పిందట. దీంతో విఘ్నేష్ కూడా ఏమీ చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేశాడట. ఇప్పటికే ఈ టైటిల్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి టైమ్ లో నయన్ సినిమా నుంచి తప్పుకుంది. మరి ఇప్పుడు నయన్ స్థానంలోకి ఎవరొస్తారో చూడాలి. చాలా కాలం నుంచి మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృతి, ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.













