మరోసారి ఆయన దర్శకత్వంలో నయనతార
పెళ్లి తర్వాత కూడా లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో షూటింగ్ దశలో ఉన్నవైతేనేం, చర్చల దశలో ఉన్నవైతేనేం మొత్తం కలిపి దాదాపు 10 సినిమాలున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరో సినిమా చేరబోతుంది. ఐదేళ్ల కిందట సర్జున్ కేఎమ్ దర్శకత్వంలో నయన్ ఐరా అనే సినిమా చేసింది. ఆ సినిమా మంచి హిట్ అవడంతో పాటూ నయనతారకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా నయన్ కు వరుసగా లేడీ ఓరియెంటెడ సినిమాలు చేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చిందని తమిళ సినీ విశ్లేషకులంటారు. అలాంటి సినిమాను తనకు ఇచ్చిన సర్జున్ దర్శకత్వంలో నయన్ ఇప్పుడు మరోసారి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
వీరి కాంబోలో సినిమా కోసం సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. స్క్రిప్ట్ పూర్తవగానే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట సర్జున్. ఇప్పటికే నయన్ ఈ సినిమా కోసం డేట్స్ కూడా ఇచ్చేసిందని టాక్. రాబోయే రెండేళ్లలో నయన్ నుంచి సుమారు 10 నుంచి 12 సినిమాల వరకు వస్తాయని ఆమె సన్నిహితులంటున్నారు.













