వావ్.. సినిమా ప్రమోషన్స్ లో నయన్
చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్న నయనతారను అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటూంటారు. తను నటించిన ఏ సినిమా ప్రమోషన్స్ కు నయన రాదు. సినిమాకు సైన్ చేసే ముందే ఈ విషయాన్ని చెప్పి దానికి దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే నయన్ సెట్స్ లోకి అడుగుపెడుతుంది. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేసినప్పుడు కూడా ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వచ్చింది లేదు. ట్విట్టర్ లో ఒక థ్యాంక్స్ నోట్ ను పోస్ట్ చేసి సరిపెట్టేస్తూంటుంది. ప్రీ రిలీజ్ల విషయం పక్కన పెడితే కనీసం ఇంటర్వ్యూలివ్వడానికి కూడా నయన్ ఆసక్తి చూపించదు. కానీ పంజా డైరెక్టర్ కు మాత్రం అమ్మడు మినహాయింపునిచ్చింది.
విష్ణు వర్ధన్ రీసెంట్ గా నేసియప్ప అనే సినిమా చేశాడు. అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాకు అనుకున్నంత బజ్ లేకపోవడంతో ప్రమోషన్స్ కోసం నయన్ ను అడిగితే వెంటనే ఆమె ఒప్పుకుంది. దీని వెనుక కారణం లేకపోలేదు. నయన్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో విష్ణు వర్ధన్ తో చేసిన బిల్లా ఎంతో స్పెషల్. ఈ సినిమా తర్వాతే ఆమెకు అవకాశాలు క్యూ కట్టడం మొదలైంది. ఆ అభిమానంతోనే నయన్ ఈ సినిమాను ప్రమోట్ చేసేలా చేసిందని తెలుస్తోంది. తనకు సహజంగా సినిమా ఈవెంట్ లకు హాజరవడం ఇష్టముండదని, విష్ణు వర్ధన్ తన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు కావడం వల్లే దీనికి ఒప్పుకున్నట్లు నయన్ ఈ సందర్భంగా తెలిపింది.













