త్రివిక్రమ్ నిర్మాణ సంస్థలో ‘నవీన్పొలిశెట్టి’ కొత్త సినిమా
‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నవీన్పొలిశెట్టి, తరువాతి ప్రాజెక్ట్‌పై అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎంటర్టైనర్ గా బలమైన కథతో సాగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్’ అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది. *నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం* ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’.
ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు “ఫార్చ్యూన్ 4 సినిమాస్”. ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ “ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం.
‘నవీన్ పోలిశెట్టి’ ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా. ఆయన కథానాయకుడు గా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని ఈరోజు ఉదయం 9.36 నిమిషాలకు అధికారికంగా ప్రకటించాయి. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటూ ప్రకటించారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. కథానాయకుడు గా ఆయనకిది మూడవ చిత్రం. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.













