నాని లైనప్ మామూలుగా లేదుగా..
పెద్దగా గ్యాప్ తీసుకోకుండా, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. ప్రస్తుతం దసరా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్న నాని, వరుసగా ఏడు సినిమాలను లైన్లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
దసరా తర్వాత తన 30వ సినిమాను శౌర్యువ్ డైరెక్షన్లో ఇప్పటికే అనౌన్స్ చేశాడు. దసరా ప్రమోషన్స్ పూర్తై, సినిమా రిలీజ్ అవగానే ఈ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతాడు నాని. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హను చెప్పిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి హిట్ అయిన విషయం తెలిసిందే.
వీటితో పాటు హిట్ ది థర్డ్ కేస్ స్క్రిప్ట్ పనులు పూర్తయితే వెంటనే నాని శైలేష్ తో సెట్స్‌కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ శైలేష్ వెంకీతో సైంధవ్ పూర్తయ్యే దాకా ఫ్రీ కాలేడు. ఇది కాకుండా అంటే సుందరానికీ ఫేమ్ వివేక్ ఆత్రేయతో కూడా ఓ సినిమా చేయనున్నట్లు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
అంతేకాకుండా నాని డేట్లు దిల్ రాజు దగ్గర ఉన్నాయి. దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ కి కమిట్మెంట్ బాకీ ఉంది. కాబట్టి స్టోరీ కుదిరితే వీరి కాంబినేషన్ పట్టాలెక్కే ఛాన్సుంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్లో మారుతి డైరెక్షన్ లో భలే భలే మగాడివోయ్ సీక్వెల్ చేసే ఛాన్స్ కూడా బాగానే ఉంది. ఇవి కాకుండా నాని సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇలా మొత్తం లెక్కలేసుకుంటే నాని ఏడు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో తన 30వ సినిమా తప్ప నాని మరో సినిమా అధికారికంగా ప్రకటించింది లేదు.













