Shambala: నాని చేతుల మీదుగా ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్ విడుదల
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘శంబాల’ ట్రైలర్‌ని ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. ఇలాంటి జానర్ చిత్రాల్నే ఆడియెన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాల్ని కరెక్ట్‌గా చేస్తే.. టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో ఇది వరకే చూశాం. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ పాట చాలా స్టైలీష్‌గా ఉంది.
ఆది నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. మంచి నటుడికి మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకు రావడం చూపించారు. ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం మీ ‘కాశీ, కాకమ్మ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు’ అని అనడం చూస్తే అతని పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ‘ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్లోనే అద్భుతంగా చూపించారు. ఇక ఇందులో ప్రవీణ్ కె బంగారి చూపించిన విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుందనిపిస్తోంది. ట్రైలర్ చివరి సీన్ మాత్రం ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించినట్టుగా అనిపిస్తుంది.
ఇప్పటికే ‘శంబాల’ మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.






